అందమైన తెలుగు యువతులను వివాహం చేసుకోవాలని భావించే విదేశాల్లో చదువుకునే తెలుగు యువకులే ఆ లేడీ కిలాడీ టార్గెట్. నెల్లూరు కు చెందిన ఈ యువతి, ఎంబీయే చదివి, తన తెలివితేటలతో, అబ్బాయిలను సులువుగా బుట్టలో వేసుకుని లక్షలు లాగేస్తుంది. తమకు అందిన పలు ఫిర్యాదులతో ఈ కిలాడీపై నిఘా పెట్టిన నెల్లూరు పోలీసును నిన్న అరెస్ట్ చేశారు. ఎస్వీ యూనివర్శిటీ నుంచి ఎంబీయే చదివిన అర్చన, నెల్లూరులోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న దుర్గా ప్రవీణ్ అనే యువకుడిని 2015లో పెళ్లి చేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లను వేదికగా చేసుకుని మోసాలకు తెరలేపింది. గూగుల్ నుంచి అందమైన అమ్మాయిల ఫొటోలను డౌన్ లోడ్ చేసుకుని, వాటితో ప్రొఫైల్స్ సృష్టించేది. తాను కేవలం విదేశీ అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్ ఇచ్చేది. ఆపై తాను పెట్టిన ఫొటో నచ్చి ఎవరైనా సంప్రదిస్తే మొబైల్ యాప్ లు వాడుతూ, వివిధ రకాల వాయిస్ లతో ఆమె వరుడి తల్లిదండ్రులతో మాట్లాడేది. వారు నమ్మారని అర్ధమయ్యాక పెళ్లికి తాను సిద్ధమంటూ, వరుడికి ఫొటోలు పంపించేది. ఆపై ఎంగేంజ్ మెంట్ రింగ్‌లు, బంగారం, ఆభరణాలు, చీరలు కావాలంటూ డబ్బులు దండుకునేది. ఈ విధానంలో యూఎస్ లో పని చేస్తున్న తన కుమారుడి నుంచి వివిధ ఖాతాల్లో డబ్బు వేయించుకుందని ఓ ఐటీ ఇంజనీర్ తండ్రి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రెస్ సాయంతో అర్చనను అరెస్ట్ చేశారు. ఇదే తరహా కేసులో ఆమె గత సంవత్సరం డిసెంబర్ లో అరెస్ట్ కాగా, బెయిల్ పై బయటకు వచ్చిందని, ఆమెను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టి, చర్లపల్లి జైలుకు తరలించామని పోలీసులు వెల్లడించారు.