చెడు వ్యసనాలు అప్పులపాలు చేయడంతో ఆ అప్పులు తీర్చడం కోసం తాకట్టు పెట్టిన తన నగలను తెచ్చివ్వాలని కోరిన ఇల్లాలిపై కోపోద్రిక్తుడై కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న భార్యను కర్రతో బాది హత్య చేశాడు. ఆపై తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో యాటకల్లులో విషాదం అలుముకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సరళమ్మకు రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. వ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర చాలా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని పేకాటలో కోల్పోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. శనివారం రాత్రి సరళమ్మ తన నగలు తనకు తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో రామచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. అలా కాసేపటి తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే తనను నిలదీసిందనే కోపంతో రగిలిపోతున్న రామచంద్రప్ప ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య సరళమ్మను కర్రతో తలపై మోదాడు. సమీపంలోనే నిద్రిస్తున్న రామచంద్ర తల్లి ఉలికిపడి లేచి చూసి గట్టిగా అరిచింది. చుట్టు పక్కల జనం వచ్చి సరళమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. భార్య చనిపోయిందని తెలుసుకున్న రామచంద్ర బహిర్భూమికని వెళ్తూ పురుగుమందు వెంట తీసుకెళ్లి అక్కడే తాగి పడిపోయాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను చూసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
|
|
|