ఎనిమిది నెలల తర్వాత తొలిసారి సమావేశం

ఎనిమిది నెలల తర్వాత తొలిసారి సమావేశం

ఇంటా, బయటా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఎనిమిది నెలల తర్వాత తొలిసారి పాలక పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అత్యంత కీలకమైన సమస్యను పరిష్కరించడానికి పాలక పార్టీని సమావేశపరుస్తున్న కిమ్.. దీని వెనుక చాలా గమ్మత్తైన పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర కమిటీ సమావేశంపై ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఈ మేరకు కొన్ని సంకేతాలను వెలువరించింది. కొరియా అభివృద్ధి, పార్టీ పోరాట సామర్థ్యాన్ని పెంచడంలో కీలక ప్రాముఖ్యత ఉన్న అంశంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.

స్వదేశంతోపాటు అంతర్జాతీయంగానూ వివిధ రంగాలలో కిమ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తోడు వరదలు రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. వరదలకు వ్యవసాయ భూములు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో కిమ్ ఆరోగ్యం విషమించినట్టు ప్రచారం జరగడంతో తదుపరి ఆయన వారసత్వం గురించి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అణునిరాయుధీకరణపై జరిగిన చర్చల వల్ల ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఇవి మధ్యలో నిలిచిపోగా.. అమెరికా, దక్షిణ కొరియాలు ఈ వారం ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి.

‘ఇటీవలి కాలంలో జరిగిన పాలక పార్టీ సమావేశంలో అసాధారణమైన వారసత్వం, విదేశాంగ విధానంలో ఉత్తర కొరియా చురుకుగా వ్యవహరించకపోవడం.. ఉదాహరణకు అణ్వస్త్ర పరీక్షలతో ఆంక్షలు ఎదుర్కోవడం.. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపాయని’ఉత్తర కొరియా పరిస్థితులపై అవగాహన ఉన్న అమెరికా ప్రభుత్వ మాజీ విశ్లేషకుడు రాచెల్ మిన్యాంగ్ లీ అన్నారు.

తమ దేశంలో కోవిడ్ -19 కేసులు ఏవీ లేవని ఉత్తర కొరియా ప్రగల్భాలు పలికింది. ఈ వాదనలపై అమెరికా, జపాన్ సహా ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. అంతంత మాత్రంగా ఉన్న వైద్య సౌకర్యాలు వల్ల ఉత్తర కొరియాకు పెను ముప్పు ఉందని, పురాతన వైద్య వ్యవస్థలు వ్యాప్తిని అడ్డుకోలేవని ఆందోళన చెందుతున్నాయి.

గతేడాది డిసెంబర్ చివరిలో నాలుగు రోజుల సుదీర్ఘ సమావేశం తర్వాత తాజాగా కేంద్ర కమిటీ సమావేశమవుతోంది. ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతను పెంపొందించడానికి కిమ్ పిలుపునిచ్చారు. క్షిపణి పరీక్షలను నిలిపివేస్తామని చేసిన ప్రతిజ్ఞకు ఇకపై ఉత్తర కొరియా కట్టుబడి ఉండదని ట్రంప్‌ను హెచ్చరించారు.తరచూ పాలక పార్టీ సమావేశం కార్యకర్తలను చైతన్యం చేయడానికి ఉపకరిస్తాయి. అంటే సోదరి కిమ్ యో జోంగ్‌కు కొత్త అధికారాలు, ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావం తదతర అంశాలు చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి.