డ్రాగన్ దేశం పై పొగ‌డ్త‌లు కురిపించిన కిమ్‌

ప్రపంచాన్ని అంతా ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనా పేరు వింటేనే అనేక దేశాలు మండిపడుతున్నాయి.కానీ ఈ సమయంలో ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం చైనా పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడం ఆశ్చర్యానికి తావునిస్తొంది.వివరాళ్లోకి వెళ్తే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని, క‌రోనా వైర‌స్‌ను చైనా నియంత్రించిన తీరు అభినందనీయ‌మ‌ని కిమ్ కీర్తించారు.

అంతేకాకుండా జిన్‌పింగ్‌ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆయ‌న త‌న‌‌ ఆకాంక్ష‌ను వెలిబుచ్చారు. ఈ మేర‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌‌కు కిమ్‌ ఓ సందేశాన్ని పంపించారు. ఈ విష‌యాన్ని ఉత్త‌ర‌కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.

20 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన వచ్చిన అనంతరం కిమ్‌ చైనాను కీర్తిస్తూ సందేశం పంపడం అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాగా, చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ త‌ర్వాత‌ ప్రపంచ దేశాలకు పాకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న‌ది. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 68 వేల మందిని పొట్టనపెట్టుకుంది. మొత్తం 38 లక్షల మంది ఈ మ‌హ‌మ్మారి బారినప‌డ్డారు.