Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళలోని సీపీఐ పోస్టర్ ఒకటి కలకలం సృష్టిస్తోంది. ఆ పోస్టర్ లో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఫొటో ఉండడమే ఇందుకు కారణం. ఈ ఫొటోను బీజేపీ నేత సంబిత్ పాత్ర ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సీపీఎం పోస్టర్ లో కిమ్ బొమ్మ ఉండడంపై ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. సీపీఎం వారు కేరళను యుద్ధక్షేత్రంగా మారుస్తారని, రాకెట్, క్షిపణులను ఆరెస్సెస్,బీజేపీ కార్యాలయాలపైకి ప్రయోగించే ప్రణాళికలను తదుపరి అజెండాగా పెట్టుకోవట్లేదనే ఆశిస్తున్నానని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.
సీపీఎం నాయకులు కిమ్ జాంగ్ ఉన్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, కేరళలో వరుసగా ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యకు గురికావడానికి ఇదే కారణమని సంబిత్ పాత్ర ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలను నేలమట్టం చేయడం సీపీఐ తర్వాతి ఎజెండా కాకూడదని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అయితే ఈ పోస్టర్ ఏ ప్రాంతంలో వెలిసిందీ మాత్రం ఆయన వెల్లడించలేదు. కేరళలో సీపీఎం, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2001 నుంచి 120 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఒక్క కన్నూరులోనే 84 మంది ప్రాణాలు కోల్పోయారని, బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఆ పార్టీ ఆరోపణల్ని సీపీఎం ఖండిస్తోంది. ఈ రాజకీయ హత్యల్లో తమ ప్రమేయం లేదని, బీజేపీ, ఆరెస్సెస్ లే హింసకు ప్రేరేపిస్తున్నాయని ఆరోపిస్తోంది.