Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికాకు వరుస హెచ్చరికలు, అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో బిజీబిజీగా ఉన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రొటీన్ జీవనసరళి నుంచి కాస్త విరామం తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియాలో కిమ్ ఫొటోలు ఎప్పుడు కనిపించినా… కిమ్ సీరియస్ గా… క్షిపణులను పరిశీలిస్తూనో, అధికారులకు ఆదేశిలిస్తూనో, మీడియా తో మాట్లాడుతున్నట్టుగానో ఉంటాయి. తాజాగా మాత్రం… ఓ ఫొటోలో కిమ్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆయన భార్య కూడా ఈ ఫొటోలో ఉంది. భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జాంగ్ తో కలిసి ప్యాంగ్యాంగ్ టూర్ కు వెళ్లిన కిమ్ ఓ సౌందర్య ఉత్పత్తుల ఫ్యాక్టరీలో కాసేపు సరదాగా గడిపారు. అక్కడి సదుపాయాలను పరిశీలించిన కిమ్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఉత్తరకొరియా అధికారిక మీడియా ఓ ఫొటోను ప్రచురించింది. ఈ ఫొటోలో కిమ్ పెద్దగా నవ్వుతూ నిలబడిఉండగా… ఆయన వెనక భార్య రి సోల్ జు నిల్చుని ఉన్నారు. కాస్మెటిక్స్ ఫ్యాక్టరీని సందర్శించి సౌందర్య ఉత్పత్తుల తయారీని పరిశీలించిన కిమ్ మహిళల కలలను నిజం చేసే ఉత్పత్తులను తయారుచేస్తున్నారని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పొగిడారు.
కొన్ని దశాబ్దాల నుంచి ఉత్తరకొరియాను కిమ్ వంశస్థులు పరిపాలిస్తున్నా… వారి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వివరాలు మాత్రం బాహ్య ప్రపంచానికి తెలియవు. ఇటీవలే కిమ్ సతీమణి మూడో బిడ్డకు జన్మనిచ్చారన్న సంగతి మాత్రం మీడియాకు తెలిసింది. కిమ్ కుటుంబం ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంది. ఉత్తరకొరియా మీడియా కూడా దేశ పాలనా వ్యవహారాల గురించిన వార్తలే ఎక్కువ ప్రచురిస్తుంది తప్ప అధ్యక్షుని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లదు. ఉత్తరకొరియా-అమెరికా సంక్షోభం నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ గురించి అంతర్జాతీయ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నా… ఆయన వ్యక్తిగత సంగతులు మాత్రం ఎవరూ ప్రస్తావించడంలేదు. మరోవైపు ఉత్తరకొరియా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోందని వస్తున్న వార్తలపై ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు.
కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్న అణుపరీక్షలను నిలిపివేసి, ఆ దేశం నోరుమూయించగల సత్తా ఒక్క చైనాకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అణుయుద్ధానికి అందరూ వ్యతిరేకమే అని, అమెరికా, జపాన్ కలిసి తమ నుంచి ఉత్తరకొరియాకు ఎలాంటి ముప్పూ ఉండబోదని నచ్చచెప్పగలిగితే యుద్ధం ముప్పు తప్పుతుందని రోడ్రిగో సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం కానున్న నేపథ్యంలో రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను తాను సాదరంగా ఆహ్వానిస్తానని, ఆయన చెప్పేది జాగ్రత్తగా వినడంతో పాటు ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల సమస్య గురించి చర్చిస్తానని తెలిపారు. తమ మధ్య చర్చల్లో ఉత్తరకొరియా అంశాన్నీ ప్రస్తావిస్తానని తెలిపారు. ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకించే రోడ్రిగో గతంలో చాలా సార్లు అమెరికా అధ్యక్షుణ్ని హేళనచేస్తూ మాట్లాడారు. అలాంటి రోడ్రిగో ఇప్పుడు ట్రంప్ పట్ల సానుకూలంగా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.