Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా… శిక్షలు ఎంత కఠినతరం చేసినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగటం లేదు. సాధారణ మహిళలే కాదు… సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీల పిల్లలు సైతం ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఓ నటిపై లైంగిక వేధింపుల కేసులో మళయాల అగ్ర హీరో దిలీప్ ను అరెస్టు చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ విషయం మరువకముందే ఇప్పుడు హర్యానాలో జరిగిన ఘటన మరోసారి దేశంలో మహిళల రక్షణ పై సందేహాలు లేవనెత్తుతోంది. ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె అయిన వర్ణికను బీజేపీ నేత సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా వేధించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. వికాస్ బరాలా ప్రవర్తనను తప్పుపట్టాల్సింది పోయి బీజేపీ నేత ఒకరు ఆయన్ను వెనకేసుకురావటాన్ని ఆ పార్టీ ఎంపీలే వ్యతిరేకిస్తున్నారు.
వర్ణిక కేసు గురించి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ రాంవీర్ భట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, రాత్రిళ్లు అమ్మాయిలను బయటకు పంపకూడదని, అయినా ఆ సమయంలో అమ్మాయిలకు బయట ఏం పని అని రాంవీర్ భట్టి వ్యాఖ్యానించారు. ఈ మాటలపై బీజేపీ మరో ఎంపీ, సినీ నటి కిరణ్ ఖేర్ తీవ్రంగా స్పందించారు. అమ్మాయిల గురించి ఇలా మాట్లాడటానికి రాంవీర్ కు నోరెలా వచ్చిందని కిరణ్ ప్రశ్నించారు. ఆయన్ను తన పార్టీ కొలీగ్ అని చెప్పుకోటానికి సిగ్గుగా ఉంది అని మండిపడ్డారు. పగలు కన్నా రాత్రి వేళలు ఎందుకు ప్రమాదకరంగా ఉంటున్నాయని ప్రశ్నించిన కిరణ్ ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అబ్బాయిలనే కాని అమ్మాయిలను కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు రాంవీర్ వ్యాఖ్యలపై బాధితురాలు వర్ణిక కూడా స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లినా,…ఏం చేసినా అది తనకు సంబంధించిన వ్యవహారమని, ఇతరులకు అవసరం లేదని, తన ఈ కేసులో బాధితురాలని తప్ప నిందితురాలని కాదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహిళలపై వేధింపులో, లైంగిక దాడులో జరిగినప్పుడు అంతా అమ్మాయిలదే తప్పని మాట్లాడటం కొందరికి పరిపాటిగా మారింది. సాధారణ వ్యక్తుల సంగతి సరే… బాధ్యతాయుతమైన ఎంపీల స్థానాల్లో ఉండేవారు సైతం ఇలాంటి మాటలు మాట్లాడటం సరైనది కాదు.
మరిన్ని వార్తలు: