కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీలోని విభేదాలు బయట పడడం కలకలం రేపుతోంది. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిషన్‌రెడ్డి తొలిసారి హైదరాబాద్ వస్తున్న నేపధ్యంలో ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో నాయుకుడు చించివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన బండపల్లి సతీష్‌కుమార్ చిలకలగూడ చౌరస్తా నుంచి వారాసిగూడ వరకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీల్లో తన ఫొటో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి రవిప్రసాద్, అతడి కుమారుడు సాయిలు ఫ్లెక్సీలను చించివేశారు. విషయం తెలిసిన సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అంతు చూస్తానని కూడా రవిప్రసాద్ బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సీనియర్ నేతనైన తన ఫొటో లేకపోవడం వల్లే ఫ్లెక్సీలు చింపివేసినట్టు రవిప్రసాద్ పేర్కొన్నారు. తన ఫొటోలేని ఫ్లెక్సీలను తన ఇల్లు, కార్యాలయం ముందు పెట్టి తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాగా, సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిప్రసాద్, సాయిప్రసాద్‌గౌడ్, సందీప్, ఉపేందర్‌లపై కేసులు నమోదు చేశారు.