తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ (80) నిన్న కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. అయితే కిషన్ రెడ్డిని చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చిన కాసేపటికే ఆమె మరణించడం యాదృచ్చికం అయినా ఈ విషయం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి పది గంటల సమయంలో కిషన్ రెడ్డికి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. ఆగంతకుడు ఉర్దూలో మాట్లాడాడని, ఆయన్ని హతమారుస్తామంటూ బెదిరించాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్ చేసిన ఆగంతకుడు ఉగ్రవాదేమోనని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో కిషన్ రెడ్డికి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. కాగా, గతంలో కూడా కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.