భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై కేఎల్ రాహుల్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండేళ్ల విరామం తర్వాత ఎంఎస్ ధోనీ తిరిగి జట్టులో కీలక బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్న కేఎల్ రాహుల్ తెలిపాడు. 2019 ప్రపంచకప్‌లో ఆడిన తర్వాత, ధోనీ ఆగష్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే ఒమన్, యూఏఈ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మెంటార్‌గా ధోని నియమితుడయ్యాడు.
సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్.. డ్రెస్సింగ్ రూమ్‌ను ధోనితో పంచకోవడం ఎంతో ప్రశాంతతను కలిగిస్తుందని చెప్పాడు. మిస్టర్ కూల్‌కు ఇంకా వయస్సు అయిపోలేదని, అత్యంత ఫిట్‌గా ఉన్నాడని రాహుల్ పేర్కొన్నాడు. రెడ్‌బుల్ క్యాంపస్ క్రికెట్ క్లబ్‌హౌస్ సెషన్లో మాట్లాడుతూ ధోనీపై తన అభిప్రాయాలను రాహుల్ తెలియజేశాడు.
“నిజంగా.. ధోనీ జట్టుతో తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము అతడి సారథ్యంలో చాలా మ్యచ్‌లు ఆడాము, అతడు మా కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మేము అతనిని మెంటార్‌గానే చూశాము. ధోనితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం మాకు చాలా ఇష్టం. మేము అతడి వల్ల చాలా ప్రశాంతతను పొందుతాం. క్రికెట్, కెప్టెన్సీ సంబంధించిన అన్ని రకాల మెళకువలను ధోని నుంచి నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ధోనీ మాలో ఎవరికైనా గట్టి పోటీని ఇవ్వగలడని నేను అనుకుంటున్నాను. ధోని ప్రపంచంలోనే అత్యత్తుమ మ్యాచ్ ఫినిషర్” అని రాహుల్ పేర్కొన్నాడు.