Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. చట్టాలు ఏమి చెబుతున్నా లెక్క చేయకుండా కోడిపందేలు, ఎద్దుల పందేల్లో రాజకీయ నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల వారే ఈ పోటీలకు చొరవ తీసుకుంటున్నారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం సంక్రాంతికి ఎడ్లకు బండ లాగుడు పందేలు పెడుతున్నారు. గుడివాడలో మూడు రోజుల పాటు ఈ పందేలు సాగుతాయి. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా? వుంది. అదే చెప్పబోతున్నాం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈ పోటీల్ని ఏ బ్యానర్ కింద నిర్వహిస్తున్నారో తెలుసా ? ఎన్టీఆర్ 2 వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.
ఎన్టీఆర్, వైఎస్సార్ రాజకీయంగా ఎన్నడూ కలిసి నడిచింది లేదు. పైగా ఇద్దరి మధ్య బతికున్న రోజుల్లో రాజకీయ వైరం గట్టిగానే ఉండేది. అయితే ఎన్టీఆర్ మరణం తరువాత చంద్రబాబుని ఇబ్బంది పెట్టేందుకు ఎన్టీఆర్ పేరుని, ఆయన పథకాల్ని వాడుకునేందుకు వైఎస్ చొరవ చూపారు. ఈ ప్లాన్ తో టీడీపీ అభిమానుల్ని కూడా ఆకట్టుకోడానికి ట్రై చేశారు. ఆ పై వైసీపీ అధినేత జగన్ సైతం అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో తగ్గుతున్న తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి పెంచుకోడానికి ఎన్టీఆర్ తో వైఎస్సార్ ని కలిపేశారు. కొన్నాళ్లుగా రాజకీయంగా ఎదురు దెబ్బలు తింటున్న నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో ?