Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిన్నమొన్నటిదాకా తెలంగాణాలో టీడీపీ తిరిగి బతుకుందన్న నమ్మకం లేకపోయినా ఎక్కడో మిణుకుమిణుకుమనే ఆశ అయినా ఉండేది. మొన్నామధ్య రేవంత్ రెడ్డి, నిన్న ఉమా మాధవరెడ్డి వెళ్ళిపోయాక పార్టీ వదిలిపోయాక ఇక మిణుకుమిణుకుమనే ఆశ కూడా లేకుండా పోయింది. ఇలాంటి టైం లో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని తెలంగాణకు చెందిన ఓ నాయకుడు పోరాటం చేస్తున్నాడు అంటే నమ్మడం కష్టమే. కానీ నిజంగా హైదరాబాద్ కి చెందిన ఓ తెలుగుదేశం నేత నిజంగానే ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ తో ఓ ప్రచార రధం భాగ్యనగర వీధుల్లో తిప్పుతున్నాడు.
ఎన్టీఆర్ కి భారత రత్న కోసం పోరాడుతున్న ఆ నాయకుడి పేరు కొమ్మినేని వికాస్. ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానించే ఈయన గత ఒకటి, రెండు సందర్భాల నుంచి శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే దానితో సంబంధం లేకుండా కూకట్ పల్లి సహా శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజలతో టచ్ లో వుంటూ వస్తున్నారు. ఈసారి ఆయన జనంలోకి ఎన్టీఆర్ కి భారత రత్న డిమాండ్ తో వెళుతున్నారు. ఇది కూడా శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమే అనే వాళ్ళు లేకపోలేదు. కిందటిసారి టీడీపీ టికెట్ తో గెలిచిన అరికెపూడి గాంధీ తెరాస లో చేరడంతో ఆ సీట్ మీద కన్నేసి ఇలా ఎన్టీఆర్ జపం చేస్తున్నాడు వికాస్ అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టీడీపీ అధికారంలో వున్న ఏపీ లో కూడా వినిపించని డిమాండ్ తో వస్తున్న వికాస్ ని ఆదరించాలి తప్ప అనుమానించకూడదని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో టీడీపీ ఉనికి డౌట్ లో పడినా ఇంకా ఎన్టీఆర్ కి విలువ తగ్గలేదు అనడానికి ఈ ఎపిసోడ్ ఓ చిన్న ఉదాహరణగా నిలుస్తుంది.