తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రాజీనామా చేసిన కొండా సురేఖ, మురళీ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వీరికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ ఈస్ట్ తో పాటు పరకాల అసెంబ్లీ టికెట్ విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోవడంతో కొండా దంపతులు పార్టీ మారారు. నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొండా దంపతులు..
టీఆర్ఎస్ పైన, కేసీఆర్, కేటీఆర్ లపైనా తీవ్ర విమర్శలు చేసి మరీ పార్టీ వీడారు. కొండా దంపతుల చేరిక మీద మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగానే కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారికి పార్టీలో ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రచార కమిటీలో సురేఖకు స్థానం కల్పిస్తామని… రాష్ట్రమంతా తిరిగి ఆమె పార్టీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాసం ఉంది. కొండా సురేఖ సమర్థవంతమైన బీసీ నాయకురాలు కావడంతో ఆమె ప్రభావం ఐదు నియోజకవర్గాలపై ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.