కొండవీడు రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు !

Kondaveedu Farmers Suicide Became Big Breaking The Political Parties

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య ఆత్మాత్య రాజకీయ రంగు పులుముకుంది. రైతుని పోలీసులే కొట్టి చంపారంని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని.. ఆత్మహత్య చేసుకున్న రైతుని కాపాడటానికి పోలీసులు ఎంతగానే శ్రమించారని చెప్తూ దానికి సంభందించిన ఫోటోలు, వీడియోలు కూడా విడుదల చేశారు పోలీస్ బాస్ లు. దీంతో రైతు మృతికి పోలీసులు, చంద్రబాబే కారణమని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. రైతు కోటయ్య మృతి విషయంలో నిజనిర్థారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నేడు కొండవీడులో పర్యటించనుంది.

మరో వైపు జనసేన కూడా కొండవీడులో పర్యటించనుంది. అదేవిధంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా నేడు రైతు కోటయ్య పొలంలో స్థానిక రైతులతో భేటి కానున్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలు ఒకేసారి కొండవీడుకు రానుండటంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అదేవిధంగా హై అలర్ట్‌ ప్రకటించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇచ్చారు. రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు అక్కడ గస్తీ పోలీసులకు సమాచారం అందిందని ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. పోలీసులంతా అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనాన్ని ఏర్పాటుచేసి ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు. హెలీప్యాడ్‌కు 700 మీటర్ల వెనక ఎక్కడో దూరంగా రైతు స్థలం ఉందని, హెలీప్యాడ్‌ కోసం రైతు స్థలం తీసుకున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీఎం వచ్చినప్పుడు హెలీప్యాడ్‌ సమీపంలోకి ఎవరూ రావొద్దని పోలీసులు మైక్‌ల ద్వారా హెచ్చరించారే తప్ప ఏ ఒక్కరిపైనా దురుసుగా ప్రవర్తించ లేదని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి డీఎస్పీ స్థాయి అధికారితో పారదర్శకంగా దర్యాప్తు చేయిస్తున్నామని ప్రకటించారు. కట్టుకథల వెనుక ఎవరున్నారనేది తేల్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.