Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేశ్ బాబు, కొరటాల శివ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ భరత్ అను నేనుపై సినీవర్గాల నుంచేకాదు..రాజకీయవర్గాల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు నేతలు ఈ సినిమాలో ఎంచుకున్న అంశాలు, సినిమాను మలిచిన విధానంపై కొరటాల శివను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా లోక్ సత్తా అధినేత జయ్ ప్రకాశ్ నారాయణ్ కూడా భరత్ అను నేనుపై ట్విట్టర్ లో తన అభిప్రాయం వ్యక్తంచేశారు. కొరటాల శివ చక్కని ప్రయత్నం చేశారని ప్రశంసించారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశానని, ప్రజల్ని ఆలోచింపచేసేలా చట్టం నిబంధనలు, స్థానిక పరిపాలన అనే రెండు బలమైన సందేశాలను కలిసి మాస్ ఎంటర్ టైనర్ గా కొరటాల శివ సినిమాను రూపొందించారని జేపీ కొనియాడారు.
స్థానికంగా తీసుకునే నిర్ణయాల ప్రభావం స్థానికుల జీవితాలపైనే ఉంటుందని, పక్కవారిమీద కాదని అప్పుడే ప్రజలు ఓటింగ్-తమ జీవితాలు, పన్నులు, సేవలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటారని జేపీ చెప్పారు. లోకల్ గవర్నమెంట్ లో అధికారాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. కొరటాల శివ ధైర్యానికి, విజయవంతమైన కష్టానికి కుడోస్ అని జేపీ ట్వీట్ చేశారు. దీనిపై కొరటాల శివ స్పందించారు. మీలాంటి వ్యక్తి దగ్గరనుంచి ప్రశంసలు లభించడం గౌరవంగా భావిస్తున్నాను సర్…మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి మాకు మీ అవసరం ఉంది అని ట్వీట్ చేశారు. అన్ని వర్గాల నుంచి లభిస్తున్న ప్రశంసలు కొరటాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ముఖ్యంగా జయప్రకాశ్ నారాయణ, కేటీఆర్ సినిమా బాగుందని చెప్పడంతో కొరటాల సంతోషంలో మునిగితేలుతున్నారు. భరత్ అను నేను చూసిన వెంటనే కేటీఆర్ తనకు ఫోన్ చేశారని, ఇలాంటి కథావస్తువు ఎంచుకున్నప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా అది డాక్యుమెంటరీ అయిపోతుందని, అలా కాకుండా కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చాలా బాగా డీల్ చేశారని కేటీఆర్ ప్రశంసించారని కొరటాల తెలిపారు. ఇక జయప్రకాశ్ నారాయణ్ సాధారణంగా సినిమాలు చూడరని, కానీ ఆయన ఈ సినిమా చూసి తనకు ఫోన్ చేసి అభినందించారని, ఈ ఇద్దరి అభినందనలు తనకెంతో ఆనందాన్ని కలిగించాయని కొరటాల సంతోషం వ్యక్తంచేశారు.