అందుకే నాలుగేళ్ళు ఆగాం

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈరోజు తిరుపతిలో ధర్మ పోరాట సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో పలువురు తెలుగుదేశం నేతలు మాట్లాడారు ముందుగా మాట్లాడిన మాజీ కేంద్రమంత్రి తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ విభజన చట్టంలో పెట్టింది మాత్రమే చేయాలని తాము అడుగుతున్నామని, ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అడగడం లేదని అన్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి ఇప్పటికే చాలా చేశామని చెప్పుకుంటున్నారని కాని మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చారని ఆయన పేర్కొన్నారు.

అలాగే ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఏమయినా ఉపయోగపడుతుందేమోనని ఆనాడు ఊరుకున్నామని అయినా అదీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. ఎన్డీఏపై పోరాటాన్ని మొదటి నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వచ్చేవని అన్నారు. అందుకే నాలుగేళ్ళు ఆగాల్సి వచ్చిందని సుజనా అన్నారు. వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర సర్కారుని నిలదీసి అడిగానని సుజనా చౌదరి అన్నారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్ర సర్కారు కాలయాపన చేసిందని పేర్కొన్నారు.

సుజనా మాట్లాడిన తర్వాత ఎంపీ శివ ప్రసాద్ మాట్లాడారు. తనదయిన శైలిలో పద్యాలతో మోడీని విమర్శించిన ఆయన నవ్వులు పూయిస్తునే ప్రత్యేక హోదా కోసం తానెలా పోరాడింది సభలో వివరించారు. అయితే ఇటీవల మోదీని విశ్వామిత్రుడి వేషంలో శపించానని ‘మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. నిన్ను అపజయాలు చుట్టుముట్ట.. నీ నెత్తిమీద శని తిష్ట’ అని శపించానని తెలిపారు. మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదని, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉంటేనే కదా అని, పార్లమెంటు సమావేశాల్లోనూ మొదటి రోజు ఐదు నిమిషాలు వస్తారని ఇక తర్వాత పత్తా ఉండరని ఆయన విమర్శించారు.

‘చంద్రబాబు నాయుడిని తక్కువగా అంచనా వేస్తున్నారు. భూమికి ఎంత సహనం ఉందో అంత సహనం ఉంది ఆయనకి. ఆకాశమంత సహృదయం ఉంది. గాలి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉంది. మనమంతా ఆయనకు అండదండగా ఉండి మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలి. మోదీ అందరికీ నీతులు చెప్పి తాను మాత్రం పాటించరు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను మరిచారు’ అంటూ మోడీని కేంద్ర ప్రభుత్వ పెద్దలని విమర్శించారు.