కేంద్ర‌మంత్రుల రాజీనామాల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

President Ramnath Kovind accept Sujana Chowdary and Ashok Gajapathi Raju Resignation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సుజ‌నా చౌద‌రి చేసిన రాజీనామాల‌ను రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు వారిద్ద‌రూ ప్ర‌ధానిని క‌లిసి త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ఆదేశాల ప్ర‌కారం తామిద్ద‌రం రాజీనామాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రితో ప్ర‌ధాని సుమారు 10 నిమిషాలు మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కార‌ణాల‌ను వారు ప్ర‌ధానికి వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించినందుకు మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంత్రుల రాజీనామా లేఖ‌ల‌ను కేంద్రం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు పంప‌గా… ఆయ‌న వాటిని ఆమోదించారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసేవ‌ర‌కు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ‌ను ప్ర‌ధాని త‌న‌వ‌ద్దే ఉంచుకోనున్నారు. అటు విభ‌జ‌న హామీల అమ‌లుకోసం టీడీపీ ఎంపీల పోరాటం కొన‌సాగుతోంది.

ఈ ఉద‌యం పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభం కాగానే ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. లోక్ స‌భ‌లో టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోసం, రిజ‌ర్వేష‌న్ల అంశంపై టీఆర్ ఎస్ ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ స‌భ‌ను వాయిదా వేశారు. అంత‌కుముందు ఇటీవ‌ల మ‌ర‌ణించిన భార‌తీయ జ‌న్ సంఘ్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మాజీ ఎంపీ భానుకుమార్ శాస్త్రికి లోక్ స‌భ నివాళుల‌ర్పించింది. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేసిన సుమిత్రా మ‌హాజ‌న్ శాస్త్రి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించాల‌ని స‌భ్యుల‌ను కోరారు. నివాళి కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే స‌భ్యులు నినాదాల‌కు దిగ‌గా… శాంతీకే బాద్ హంగామా… శాంతి త‌ర్వాత హంగామా అంటూ స్పీక‌ర్ జోక్ వేశారు. స‌భ్యుల‌ను వెన‌క్కు మ‌ళ్లాల‌ని స్పీక‌ర్ కోరిన‌ప్ప‌టికీ… ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌భ‌ను వాయిదా వేశారు.

రాజ్య‌స‌భ‌లోనూ ఆందోళ‌నలు కొన‌సాగ‌డంతో చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు మ‌ధ్యాహ్నానికి వాయిదావేశారు. అనంత‌రం టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ వెలుప‌ల ఆందోళ‌న కొన‌సాగించారు. పార్ల‌మెంట్ లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి ఏపీకి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌ర్వాత‌… స్వ‌తంత్ర ఎంపీలుగా రాష్ట్రంకోసం పోరాడ‌తామ‌ని చెప్పిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా తొలిసారి ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. రోజుకో వేషంతో ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ కోయ‌దొర వేషంలో ఆందోళ‌న నిర్వ‌హించారు.