సుజనా పార్టీ మారతారా ?

Sujana Chowdary May Joins in BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పార్టీ మారి బీజేపీ తీర్ధం పుచుక్కోనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరువాత కేంద్రంతో సంప్రదింపుల విషయంలో కీలక పాత్ర పోషించిన సుజనా ఇపుడు కమలం పెద్దలతో ఆయన టచ్ లో ఉన్నారని ప్రస్తుత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. సుజనా పార్టీ మారతున్నారన్న విషయం మంత్రుల ఎమ్మెల్యేల మధ్య చర్చకు కూడా వచ్చిందని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక డెక్కన్ క్రోనికిల్ ఓ కధనాన్ని ప్రచురిచింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సభ్యులుగా ఉన్న ఎన్సీబీఎన్ వాట్సప్ గ్రూపులో సుజనా చౌదరి పార్టీ మారడం పై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ మాకు అలాంటి సమాచారం అందలేదు. వాస్తవం వెలుగులోకి వచ్చేవరకు వేచిచూద్దాం అని సుజనా పార్టీ మారడం పై గ్రూపులో జరుగుతున్న చర్చపై కామెంట్ చేసినట్టు సదరు కథనంలో తెలిపింది.

లోకేశ్ స్పందన అటు నిర్ధారించడం గానీ, ఇటు ఖండించడం గానీ కాకుండా తటస్థంగా ఉండటంతో ఈ అంశంపై గ్రూపులో మరింత చర్చకు దారి తీసిందని ఆ పత్రిక పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీ నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. అసలు మోడీ నివాసం దగ్గరలోకి పూర్తిగా రాకముందే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సుజనాను వారు అదుపులోకి తీసుకోలేదు. ఆయన నేరుగా మోడీ నివాసానికి వెళ్లారనే ప్రచారం కూడా జరిగింది. అంతే కాక మోడీ టీమ్ లోని మంత్రులతో సుజనా చౌదరికి సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ  చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇప్పించడంలో కూడా సుజనా అంత శ్రద్ద చూపించేవారు కాదని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో టీడీపీకి విరాళాల సేకరణ, ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో సుజనా కీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విషయాల్లోనూ ఆయనదే ప్రధాన పాత్ర. కెబినెట్ మంత్రుల ఖరారు నుంచి కీలక ప్రాజెక్టుల అప్పగింత వరకు ఆయన అన్నీ చూసుకున్నారు. చంద్రబాబుకు విశ్వసనీయుడు కావడంతో కేంద్రమంత్రి పదవి కూడా ఆయనను వరించింది. చంద్రబాబు సందేశాలను ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేరవేయడంలో, ఢిల్లీలో టీడీపీ తరుపున పనిచేయడంలో సుజనా కీలకంగా వ్యవహరించారు. ఇది పుకారో నిజమో తెలియదు కానీ ఇక సుజనా పార్టీ వీడి వెళ్ళిపోవడమే అన్నంతగా ప్రచారం జరిగింది. అయితే సుజనా మాత్రం ఈ ప్రచారాన్ని తీసిపారేస్తున్నారు. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అని అంటున్నారు సుజనా. తాను బీజేపీలో చేరతానన్నవి వదంతులు వారు పుట్టిస్తున్నవే అని వాపోతున్నారు.