మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జార్జియా దేశంలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు చిత్ర యూనిట్ సభ్యులు సిద్దం అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సైరా చిత్రంను వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత రామ్ చరణ్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తి కాకుండానే దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి ఒక చిత్రం చేసేందుకు కమిట్ అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఒక పక్కా మాస్ మసాలా స్క్రిప్ట్‌ను చిరంజీవి కోసం సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతుంది.
మొన్నటి వరకు చిరంజీవి, కొరటాల కాంబోలో మూవీ నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీ వచ్చే సంక్రాంతికి పట్టాలెక్కబోతుంది. పండుగ రోజే ఈ చిత్రంకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి. ఆ తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో కొరటాల నిమగ్నమై ఉన్నాడు. భరత్ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఉన్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రారంభించి అదే ఏడాది సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.