జలగం గెలుపుకే ఇద్దరు తోడల్లుళ్ళ పోటీ…!

Kothagudem Constituency Review

చివరి దశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే, కేసీఆర్ ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత జైలుకు తరలించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదే ఊపులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఉద్యమం ఉధృతంగా మారింది. అదేం విచిత్రమో కానీ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఎక్కువ మొత్తంలో సీట్లు సంపాదించాయి. అయితే కొత్తగూడెంలో గత ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కంటే ఇద్దరు వ్యక్తులే కారణం. తోడల్లుళ్ళు అయిన వనమా వెంకటేశ్వర రావు, యడవల్లి కృష్ణలు చీల్చిన ఓట్ల వల్లే టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు విజయం సాధించారు. ఇద్ద‌రు తోడ‌ళ్లుల్లు అయినా కూడా రాజ‌కీయాల్లో మాత్రం ఒక‌రంటే ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. ఒకేగూటి ప‌క్షులు అయిన వీరిద్ద‌రు విబేధాల‌తో వేర‌య్యారు. 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన కృష్ణ భారీగా ఓట్లు చీల్చి వ‌న‌మా ఓట‌మికి కార‌ణ‌మ‌య్యారు. ఈ ఇద్ద‌రు నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లోనూ అంటే 2014లోనూ కొత్త గూడెం నుంచి పోటీ చేశారు. కృష్ణ భారీ ఎత్తున ఓట్లు చీల్చారు.

AP congress to work against bjp and ycp

అప్ప‌ట్లో వ‌న‌మా వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో య‌డ‌వ‌ల్లి కృష్ణ ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుని ఓట్లు చీల్చ‌డంతో వ‌న‌మాకు ప‌డాల్సిన ఓట్లు కూడా టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన జ‌ల‌గం వెంక‌ట‌రావుకు ప‌డి ఆయ‌న గెలుపొందారు. 2009, 2014ఎన్నిక‌ల్లో రెండుసార్లు య‌డ‌వ‌ల్లి కృష్ణ ప‌రోక్షంగా వ‌న‌మాను ఓడించారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న య‌డ‌వ‌ల్లి సీటు ఆశించారు. చివ‌ర్లో కాంగ్రెస్ సీటు రాని వ‌న‌మా పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేశారు. చివ‌ర‌కు య‌డ‌వ‌ల్లి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా వీరిద్ద‌రు పోటీ ప‌డుతున్నారు. ఇలా కృష్ణ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌న‌మా ఓట‌మికి కార‌కుల‌య్యారు. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత య‌డ‌వ‌ల్లి కాంగ్రెస్‌లో చేరారు. ఆ త‌ర్వాత వ‌నమా కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీఆర్ఎస్ నుంచి జలగం వెంకటరావు బరిలో ఉండగా చివరి క్షణం వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన యడవల్లి కృష్ణ టికెట్ దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ తరపున బరిలో దిగారు. ఇక మహాకూటమి తరపున కాంగ్రెస్ ఈ సీటును తీసుకొని వనమా వెంకటేశ్వరరావుకు ఇచ్చింది. మహా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, టీడీపీకి కూడా ఈ నియోజకవర్గంపై పట్టుండటంతో చివరి వరకు ఆ సీటు కావాలనే కోరుకున్నాయి. కాని కాంగ్రెస్ ఈ సీటును తమకే కేటాయించుకుంది. ఇక గత కొన్ని ఏండ్లుగా టీడీపీలో ఉన్న కోనేరు నాగేశ్వర రావు(మరణించారు) కుమారుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఈ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు వెళ్లడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

vanama-venkateswarao-krishn

వనమా, కోనేరు కుటుంబాల మధ్య గత కొన్ని ఏండ్లుగా రాజకీయ వైరం ఉంది. అయితే ఇప్పుడు మహాకూటమి వల్ల కలిసి పని చేయాల్సి రావడం చిన్ని అసంతృప్తికి కారణమైంది. చిన్నిని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పిలిపించి బుజ్జగించడంతో ఆయన చల్లబడ్డారు. ఇక సింగరేణి బెల్డులోని ఈ నియోజవర్గాన్ని సీపీఐ తరపున మాజీ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ఆశించారు. కాని ఇప్పుడు టీడీపీ, సీపీఐ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఓట్లను మహాకూటమి అభ్యర్థికే వేస్తే ఈ సారి కాంగ్రెస్ విజయం ఖాయమే. కాని గత ఎన్నికల్లో వనమ ఓటమికి కారకుడైన తోడల్లుడు యడవల్లి ఈ సారి బీఎల్ఎప్ తరపున నిలబడటంతో ఈ ఎన్నికలు మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  అయితే వ‌న‌మా క‌నుక కృష్ణ‌ను బుజ్జ‌గిస్తే ప‌రిస్థితి అనుకూలంగా మారుతుంద‌ని అంటున్నారు. కానీ, ఇది జ‌రిగే వ్య‌వ‌హారంలాగా క‌నిపించ‌క పోవడంతో కొత్త‌గూడెంలో అస‌లు ఫైట్‌ ఈ ఇద్ద‌రు తోడల్లుళ్ళ మ‌ధ్యే సాగుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ సారి కూడా మళ్లీ గత ఎన్నికల్లో జరిగిన పరిస్థితే రిపీట్ అవుతోంది. జలగం వెంగళరావు గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు.

jalagam-venkatarao