ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్‌లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.
అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు.