తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్‌ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోవిడ్‌–19 కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్‌ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్యదేశాల ఒపెక్, అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్‌ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది.

పెట్రోల్‌ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలైన అమెరికా, చైనా, భారత్‌, జపాన్‌లలో ధరల నియంత్రణ కోసం ముడి చమురు ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్‌ దేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాలేదు. దీంతో ఈ దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి పెట్రోలును రిలీజ్‌ చేశాయి. దీంతో చమురు ఉ‍త్పత్తి దేశాలు, వినియోగదారులైన దేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.