టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు కృనాల్ బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రణశ్ అమిన్‌కు శుక్రవారం ఇ- మెయిల్ పంపాడు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం… ‘‘ప్రస్తుత దేశవాళీ సీజన్లో బరోడా కెప్టెన్‌గా కొనసాగబోను. అయితే, సెలక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాను. జట్టు కోసం ఆడతాను. ఆటగాడిగా బరోడా క్రికెట్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఎల్లప్పుడూ జట్టు మెరుగైన ప్రదర్శన కోసం పాటుపడతాను’’అని కృనాల్ పాండ్యా మెయిల్లో పేర్కొన్నాడు.
కాగా ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ సారథ్యంలోని బరోడా జట్టు దారుణంగా విఫలమైంది. ఐదింట కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆటగాడిగా కూడా కృనాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక విషయంలో కృనాల్ తనకు నచ్చిన ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాడంటూ ఆరోపణలు వచ్చాయని బీసీఏ సన్నిహిత వర్గాల సమాచారం.
ఈ క్రమంలో ఓ ఆటగాడు సెలక్టర్లతో వాదనకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా.. అతడి స్థానంలో బీసీఏ కేదార్ దేవ్‌ధర్‌కు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది తమిళనాడు ఈ దేశవాళీ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో కర్ణాటకను ఓడించి మూడోసారి ట్రోఫీని గెలిచింది. ఇక కృనాల్ విషయానికొస్తే.. టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు… ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.