భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తొలుత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వైరస్ బారిన పడగా.. అనంతరం మరో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ సోకింది. అయితే కృనాల్ కరోనా వ్యవహారంలో కొన్ని సంచలన నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కృనాల్ గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే(జులై 26) బీసీసీఐ వైద్యుడు అభిజిత్ సల్వీ ర్యాపిడ్ టెస్ట్ చేయలేదని తెలుస్తోంది.అంతేకాకుండా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు కూడా సదరు వైద్యుడు కృనాల్‌కు అనుమతి ఇచ్చాడట.
అయితే, గొంతు నొప్పి తీవ్రం కావడంతో ఆ మరుసటి రోజున(జులై 27) కృనాల్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక ఆ రోజు జరగాల్సిన మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, లంక బోర్డులు ప్రకటించాయి. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మందికీ పరీక్షలు చేయగా, అప్పుడు అందరికీ నెగెటివ్ అనే వచ్చింది. అయితే, శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్‌కు పాజిటివ్ అని తేలింది.
ఇదిలా ఉంటే, లంక పర్యటనలో మూడు వన్డేల సిరీస్, తొలి టీ20 సజావుగా సాగాయి. మొదటి టీ20 తర్వాత కృనాల్ కరోనా బారిన పడటంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. 11 మంది అందుబాటులో లేకపోవడంతో.. లంక పర్యటనకు నెట్ బౌలర్లుగా వెళ్లిన వారు జట్టులోకి వచ్చారు. దాంతో జట్టు బలహీనంగా మారి 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది.