మన దేశంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో కీలకమైన చర్యలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేశారు. ఇకపోతే ఈ మహమ్మారి భారిన పడ్డ బాధితుల సహాయార్థం ఒక్కొక్కరుగా ప్రభుత్వ సహాయ నిధికి భారీ విరాళాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు మొదటగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అంటే మొత్తంగా ఒక కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ అందజేశారు.
ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. దానికి స్పందించిన పవన్ కళ్యాణ్… ”ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు మంత్రి కేటీఆర్ సార్” అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ ద్వారా పోస్టు చేశారు పవన్ కళ్యాణ్…
కాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి సమాధానం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ”ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి” అని కోరారు. మళ్ళీ ఆ ట్వీట్ కి పవన్ కళ్యాణ్ ‘సరే తమ్ముడూ’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కాస్త సామాజిక మాంద్యమాల్లో వైరల్ గా మారిపోయింది.