సీనియర్ జర్నలిస్ట్, బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా వ్యవహరించిన కుల్‌దీప్ నయ్యర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 95 సంవత్సరాలు. ఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1923 ఆగస్ట్ 14న పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌లో కుల్‌దీప్ నయ్యర్ జన్మించారు. మానవహక్కుల కార్యకర్తగా పనిచేశారు. 1975-77ల్లో ఎమర్జన్సీ కాలంలో అరెస్టు అయ్యారు. ఉర్దూ జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కుల్‌దీప్ నయ్యర్ ‘బియాండ్ ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్ నెహ్రూ’ లాంటి ఎన్నో ప్రముఖ పుస్తకాలను రచించారు.
మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కాలమ్స్ రాశారు. ద స్టేట్స్‌మన్ (ఇండియా), పాకిస్థాన్ పత్రికలైన డాన్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ద న్యూస్ పాకిస్థాన్‌తో పాటు ద డైలీ స్టార్, ద సండే గార్డియన్ లాంటి పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు. తెలుగులో కూడా ఓ ప్రముఖ పత్రికకు వ్యాసాలు రాశారు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యుల్లో ఆయన ఒకరు. 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1997 ఆగస్టులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే కులదీప్ మృతికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ తమ తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఆయన మృతికి ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.