కరోనాతో ప్రపంచమంతా విలవిలలాడిపోతుంటే… కొందరు బడాబాబులు మాత్రం నిబంధనలను అతిక్రమించి వారి వారి ఆనందాలను అనుభవించేస్తున్నారు. అనుకున్నది తడవుగా జరగాల్సిందేనంటూ మంకుపట్టు వీడటం లేదు. ఏదైతే వారి కావాలని భావించారో అది అయ్యేంతవరకు ఏమాత్రం తగ్గడం లేదు. అదేమంటే.. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు, హీరో నిఖిల్-రేవతిల పెళ్లి వేడుక జరిగింది. రామనగరకు సమీపంలోని కేతగాన హళ్లిలోని ఫాంహౌస్లో ఈ వివాహ వేడుక నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అయితే సుమారు 30-40 కార్లలో అతిథులు వెళ్లినట్లు సమాచారం అందుతుంది. కరోనా వ్యాప్తి సమయంలో లాక్డౌన్ విధించడంతో వివాహ వేడుకలు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కావద్దని ఇప్పటికే కేంద్రం పలు నియమాలను విధించింది. కుమారస్వామి కొడుకు వివాహం గ్రాండ్గా నిర్వహించడంపై రాష్ట్రంలో పెద్ద వివాదమే రగులుతోంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వివాహం జరిపినందుకు రాష్ట్ర సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. నిఖిల్ వివాహానికి 200 మందికి పైగా అతిథులు వచ్చినట్లు సమాచారం. ఫేస్ మాస్క్లు ధరించకపోవడంతో పాటు.. సామాజిక దూరం పాటించకపోవడం.. ఆ విధంగా వివాహం జరిపించిన పద్ధతిపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వివాదమే నడుస్తోంది. అందుకు కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ తాము ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే వేడుక నిర్వహించామని.. కర్ణాటక ప్రభుత్వ అనుమతితో అన్ని జాగ్రత్తలు పాటించామని తెలిపారు అలాగే.. సామాజిక దూరం పాటించక పోయినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా వివాహానికి సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం ఒక్కరు కూడా భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా పెళ్లి వేడుకులో పాల్గొన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.