విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మేశాడు సత్య హరిశ్చంద్రుడు. ఇప్పడు జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు భార్య, పిల్లల్ని అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా వెంకటమ్మ, పసుపులేటి మద్దిలేటి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఆటో నడిపే మద్దిలేటి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జల్సాల కోసం అప్పులు చేస్తూ భార్యాపిల్లల్ని వేధిస్తున్నాడు. మద్దిలేటి మద్యానికి బానిసై ఊర్లో రూ.15 లక్షలు అప్పుచేశాడు. ఇక ఈ అప్పు తీర్చేందుకు 13ఏళ్లున్న తన రెండో కుమార్తెను రూ.1.5 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు. బాండ్ కూడా రాసి ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న వెంకటమ్మభర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలతో సహా నంద్యాలకు వచ్చి తలదాచుకుంటోంది.
రెండో కూతుర్ని అమ్మేసిన మద్దిలేటి మిగతా సంతానం, భార్యపై దృఫ్టి పడింది. మూడు, నాలుగో కూతురుతో పాటు భార్యను 11 లక్షల రూపాయలకు అమ్మేందుకు తన సొంత అన్నయ్యతో బేరం కుదుర్చుకున్నాడు. బాండ్ పేపర్ పై సంతకం చేసేందుకు నిరాకరించిన వెంకటమ్మను మద్దిలేటి చితకబాదాడు. భర్త అమానుషాన్ని భార్య వెంకటమ్మ తెలివిగా బయటపెట్టింది. భర్త చేస్తున్న మైనర్ కూతురి వివాహాన్ని ఆపాలంటూ ఆమె ఐసీడీఎస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. కానీ అధికారులు సీన్లోకి ఎంట్రీ అయ్యే సరికి అసలు విషయం గుట్టు రట్టయ్యింది. ఐసీడీఎస్ అధికారుల రాకతో మద్దిలేటి పారిపోయాడు. దీంతో వెంకటమ్మ ఐసీడీఎస్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజెల్, పిల్లల సంరక్షణ అధికారి శారదకు విషయం తెలిపింది. బాధితురాలినుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.