జగన్,కేవీపీ మధ్య నంద్యాల బంధం?

kvp giving suggestions to jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వై.ఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ తన తండ్రి సన్నిహితుల్ని తనతో పాటు ప్రయాణం చేయించలేకలేకపోయారు. జనరేషన్ గ్యాప్ దీనికి కారణమని ఓ జనరల్ విశ్లేషణతో దీన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే వై.ఎస్ వెంట నడిచిన ఎంతోమంది జగన్ ఈడువాళ్ళు కూడా ఆయనతో నడవలేకపోయారు. అంటే అంతకు మించిన కారణం ఏదో వుండివుండాలి. దీనిపై మాట్లాడేందుకు జగన్ ఇష్టపడరు. ఇక వై.ఎస్ మీద గౌరవంతో ఆయనకి దూరమైన వాళ్ళు మాట్లాడేందుకు సిద్ధపడరు.

వై.ఎస్ ని అనుక్షణం అంటిపెట్టుకు వున్న సూరీడు, రవి చంద్ర… ఇక ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీ, వ్యూహప్రతివ్యూహాల్లో ఉద్దందుడు అయిన ఉండవల్లి… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతు ఉండదు. వీరిలో ఏ ఒక్కరూ జగన్ తో నడవడానికి సిద్ధపడలేదు. ఉండవల్లి లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో జగన్ వైఖరి మీద పరోక్షంగా కొంత అసహనం ప్రదర్శించి ఉండొచ్చు. కానీ కేవీపీ మాత్రం ఒక్కసారి కూడా జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇన్నర్ సర్కిల్స్ చెబుతున్న దాని ప్రకారం కేవీపీ వైఖరి ఆది నుంచి జగన్ కి పెద్దగా నచ్చేది కాదట. అందుకే ఆయనతో పాటు వై.ఎస్ సన్నిహితుల్ని దగ్గరకు రాకుండా జగన్ జాగ్రత్తపడ్డారని చెబుతారు. ఇదంతా 2014 ఎన్నికల దాకా నడిచిన వ్యవహారం. ఆ ఎన్నికల్లో ఊహించని ఓటమితో జగన్ మైండ్ సెట్ కొంత మారింది అంటున్నారు.

వై.ఎస్ సన్నిహితులంతా ఆ తర్వాత జగన్ తో నేరుగా మాట్లాడుతున్నారు అని చెప్పలేకపోయినా ఎవరో మధ్యవర్తుల ద్వారా వాళ్ళు పంపిస్తున్న సలహాలు పాటించడానికి జగన్ కాస్త ఇంటరెస్ట్ చూపుతున్నారట. ఇటీవల శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ లో చేర్చుకోవడం వెనుక కేవీపీ ఇచ్చిన సలహా పనిచేసిందని తెలుస్తోంది. వై.ఎస్ బతికున్నప్పుడు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కేవీపీ చెప్పినట్టే నడుచుకునేవారట. ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించే కేవీపీ శిల్పాని జగన్ పార్టీలోకి పంపగలిగారట. అంతకు ముందు శిల్పా కోసం ప్రయత్నించి విఫలమైన జగన్ ఇప్పుడు కేవీపీ సహకారంతోటే ఆ అడ్డంకి అధిగమించగలిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం జగన్ దృష్టిలో పడిందట. అందుకే ఇకపై కేవీపీ సూచనలు, సలహాలు పాటించడానికి కూడా జగన్ రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. మామ అల్లుడు అని పిలుచుకునేంత చనువున్న ఈ ఇద్దరి మధ్య ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కుదరని రాజీ నంద్యాల ఉపఎన్నిక సాధ్యమైనట్టుంది. ఇప్పుడిప్పుడే ఈ మామ అల్లుళ్ళ మధ్య ఏర్పడుతున్న సత్సంబంధం ఎటు దారి తీస్తుందో చూడాలి.