Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వీలున్నప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుంటారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు . తాజాగా మరోమారు ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో పోలవరం ప్రాజెక్టుపై బాబు వైఖరిని తప్పుబట్టిన కేవీపీ ఈ సారి అమరావతి నిర్మాణంపై విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణ డిజైన్ల తుదిరూపులో దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడాన్ని కేవీపీ తప్పుబట్టారు. మరోసారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కొత్త రాజధానిని నిర్మించేందుకు ఈ ఐదేళ్లు సరిపోలేదని, మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలను మభ్యపెట్టేందుకే బాబు..అంతర్జాతీయంగా పేరొందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించిన డిజైన్లను తిరస్కరించారని కేవీపీ విమర్శించారు. ఇది చంద్రబాబు కుటిల రాజకీయ ఆలోచన ధోరణికి అర్ధం పడుతోందని మండిపడ్డారు. అంతకుముందు అద్భుతమంటూ పొగిడిన జపాన్ ఆర్కిటెక్ట్ సంస్థ మకీని చంద్రబాబు ఏకపక్షంగా పక్కకు తప్పించారని, ఇప్పుడు నార్మన్ ఫాస్టర్ ను కూడా తప్పించి రాజమౌళి కావాలంటున్నారని కేవీపీ ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను మభ్యపెడుతూ పబ్బంగడుపుకునే ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు.