ప్రియుడి కోసం భర్తను చంపింది….కానీ అది మర్చిపోయింది !

Lady killed husband for illicit affair

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. ప్రియుడితో కలిసి హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ వారి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులని ఆశ్రయిస్తే పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే వైరాకు చెందిన అబ్దుల్లా(27) జూలూరుపాడుకు చెందిన షేక్‌ హమీదాను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్దుల్లా స్థానికంగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో ‘అక్బర్’ అనే వ్యక్తి ప్రవేశించడంతో హమీదాకు అతనితో వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అక్బర్‌తో హమీదా నిత్యం ఫోన్‌లో మాట్లాడటం తాను ఇంట్లో లేనప్పుడు అతను హమీదా వద్దకు వచ్చి వెళ్తుండటం అబ్దుల్లాను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. ఎన్నిసార్లు మందలించినా ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. కుల పెద్దల్లో పంచాయతీ పెట్టించాలని చూసినా వారి తీరు మారలేదు సరికదా అబ్దుల్లాను హత్య చేసి తమకు అడ్డు తొలగించుకోవాలని భావించారు. పథకం ప్రకారం గురువారం హమీదా అక్బర్‌ను ఇంటికి రప్పించింది. ఆ సమయంలో అబ్దుల్లా నిద్రపోతుండటంతో అక్బర్ అతని గొంతు నులిమాడు. అబ్దుల్లా కదలకుండా హమీదా అతని కాళ్లు గట్టిగా పట్టుకుంది. హత్యానంతరం మూర్ఛతో చనిపోయినట్టు హమీదా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించక తప్పలేదు. మరో దారుణం ఏంటంటే వీరు హత్య చేస్తున్న సమయంలో వారి ఇద్దరి పిల్లలు చూస్తూనే ఉన్నారు, వారి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు.