నెల్లూరు హాస్టళ్ళలో వరుసగా జరుగుతున్న చోరీలు

నెల్లూరు హాస్టళ్ళలో వరుసగా జరుగుతున్న చోరీలు
లేడీస్ హాస్టళ్లలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటానంటూ వచ్చి అమ్మాయిలను దోచుకుంటున్న కిలేడీ నెల్లూరు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. రూమ్‌‌లో ఉండే ఇతర అమ్మాయిల నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని పరారవుతోంది.
జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ చేతివాటం ప్రదర్శించింది.
పోలీసుల కథనం ప్రకారం…వింజమూరుకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. 2013లోనే దొంగతనం కేసులో ఇరుక్కుని తప్పించుకుని తిరుగుతున్న ఆమె కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో నెల్లూరుకు మకాం మార్చిన ఆమె హాస్టళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. జులై 21న వీఆర్సీ సెంటర్‌లో ఓ లేడీస్‌ హాస్టల్‌లో నిద్రలో ఉన్న రూమ్‌మేట్ బంగారు ఆభరణాలు దోచుకుని పరారైంది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగానే తాజాగా హరనాథపురంలోని ఓ హాస్టల్‌లో బ్యాంకు ఉద్యోగిని నమ్మించి ఆమె సెల్‌ఫోన్, ఏటీఎం కార్డుతో పాటు రూ.4వేల నగదు దోచుకుంది. దీంతో బాధితురాలు నెల్లూరు పోలీసులను ఆశ్రయించింది. దొంగిలించిన కార్డు ద్వారా నిందితురాలు ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు, రూ.20వేల నగదు కూడా డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కిలాడీ కోసం గాలిస్తున్నారు.