Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడైతే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లగడపాటి రాజగోపాల్ ప్రకటించారో అప్పటి నుంచి ఆయన వ్యవహారశైలిలో అనూహ్య మార్పులు వచ్చాయి. తెలంగాణ రాక ముందు సైమైక్య వాద వాయిస్ లా వినిపించిన లగడపాటి ఆ తర్వాత ఎన్నికల సర్వేలకు సంబంధించి మినహా ఏ రాజకీయ విషయాల్లో బయటికి మాత్రం మాట్లాడిన దాఖలాలు లేవు. ఆంతరంగిక సమావేశాల్లో రాజకీయ చర్చలు చేస్తున్నా బహిరంగంగా మాత్రం తెలంగాణ రాదని చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయి ఏదయితో చెప్పాడో అదే ఫాలో అవుతున్నాడు. అడపాదడపా ఆయన టీడీపీ లో చేరతాడని వార్తలు వస్తున్నా లగడపాటి అదేమీ లేదని చెప్తూనే వున్నారు. ఇక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వుండే ఆలోచన లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు.
తెలంగాణ అంశంలో ఆయన ఫెయిల్ అయినప్పటికీ ప్రత్యర్థి కెసిఆర్ నోటి మీదుగా కూడా ప్రశంసలు అందుకున్న నాయకుడు లగడపాటి.
ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకునే అభిమానులు చాలా మంది వున్నారు. ఇదే ఆలోచనతో హైదరాబాద్, కేపీహెబీ లో కమ్మ వనభోజనాలు నిర్వహిస్తున్న వాళ్ళు లగడపాటి కి కూడా ఆహ్వానం పలికారు. ఆయన మాట్లాడితే సంచలనం అవుతుందని, ఆయన మనసులో రాజకీయంగా ఏముందో తెలుసుకునే అవకాశం ఉంటుందని అనుకున్నారు. అయితే వారు ఊహించినట్టు జరగలేదు. వనభోజనాలకు వచ్చిన లగడపాటి సభావేదిక మీద అయితే కూర్చున్నారు గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడకు వచ్చిన మిగిలిన నాయకులు మాట్లాడుతున్నా ఆయన మాత్రం మౌనం వీడలేదు. సభలో కాసేపు కూర్చుని తర్వాత వెళ్లిపోయారు. ఒకప్పుడు లగడపాటి టీవీ చర్చలు చూసిన చాలా మంది ఆయన మౌనం చూసి నిరుత్సాహపడ్డారు.