రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన లగడపాటి దానికి తగ్గట్లుగానే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన రాజకీయ ఆసక్తి ఎక్కువ కావడం వలన ఎక్కడ ఎన్నికలు జరిగినా తన టీంతో సర్వేలు చేయించి విడుదల చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలుమార్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దాంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారని… అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానన్న విషయాన్ని ఎన్నడూ ధృవీకరించలేదు అదే సమయంలో ఆయన గట్టిగా ఖండించేవారు.
ఈ సారి మాత్రం అవకాశం వస్తే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఆయన రాజకీయాల్లోకి మళ్లీ రావడం ఖాయమని తేలిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అవకాశం వస్తే తెలంగాణ నుంచి కచ్చితంగా లోక్ సభకు పోటీ చేస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. కానీ అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు. ఆంధ్రా భావోద్వేగాలతో రాజకీయాలు చేయబోనన్నారు. తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని కూడా ఆయన ప్రకటించారు. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన పేరు మీద వస్తున్న సర్వేలు ఏవీ కరెక్ట్ కాదని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం ప్రజల నాడి చెబుతానని అలాగే డిసెంబర్ 7 తర్వాత మా సర్వే వివరాలు వెల్లడిస్తానన్నారు.
తెలంగాణ కాంగ్రెస్, – టీడీపీ పొత్తు ఫలితిస్తుందా.. మంచి ఫలితాన్ని ఇస్తుందా లేదా.. అన్నది ప్రజలే తేల్చాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కాదని అందుకే పొత్తులు పెట్టుకుంటున్నాయని విశ్లేషించారు. పార్టీలు కోరితే ముందే సర్వేలు చేసి చెబుతానన్నారు. అయితే తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయన్న అభిప్రాయం లగడపాటిలో కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన తెలంగాణ నుంచి పోటీ ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు కొనసాగుతున్నందున రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అప్పుడు ఆయన తన పాత కాంగ్రెస్ తరపున ఆయన ఏదో స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి లగడపాటి ఈజ్ బ్యాక్ అని ఆయన అభిమానులు అయితే సంబరాలు మొదలుపెట్టేసారు కూడా.