కేసు పెడతానంటున్న లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi files a case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఉన్నట్లుండి అన్నగారు ఎన్టీఆర్‌పై వరుసగా చిత్రాలు వస్తున్నాయి. నేను తీస్తాను అంటే నేను తీస్తాను అంటూ ముందుకు వస్తున్నారు. ఎప్పుడైతే బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నాను అంటూ ప్రకటించాడో అప్పుడే వర్మ మదిలో కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి ఆలోచన పడ్డట్లయ్యింది. అయితే అందరు ఆలోచించినట్లుగా ఆయన ఆలోచన ఉండదు కదా.. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎన్టీఆర్‌ నుండి చంద్రబాబుకు అదికారం ఎలా బదాలాయింపు అయ్యింది అనే విషయాలను తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వర్మ చేయబోతున్న ఈ సినిమాపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. 

ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని వర్మ పాజిటివ్‌గా చూపించే అవకాశం ఉందని, చంద్రబాబు నాయుడును నెగటివ్‌గా చూపించే అవకాశం ఉందని ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది. ఇక తన గురించి పాజిటివ్‌గా చూపిస్తాడు అనే నమ్మకంతో వర్మకు లక్ష్మీ పార్వతి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి అనుకూల వర్గం వారు కొందరు ఎన్టీఆర్‌పై తాము ఒక చిత్రాన్ని తీస్తామని ముందుకు వచ్చారు. ఆ సినిమా పేరు ‘లక్షీస్‌ వీరగ్రంధం’. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకోక ముందు లక్ష్మీ పార్వతి ఏంటి, ఆమె భర్త వీరభద్రం ఎవరు అనే విషయాలను చూపించనున్నారు. 

తనపై సినిమాను చేయబోతున్న నేపథ్యంలో లక్ష్మీ పార్వతి తాజాగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేశారు. తన అనుమతి లేకుండా తన గురించి సినిమా చేసే హక్కు ఏ ఒక్కరికి లేదని, చట్ట పరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా తనపై ఏదో ఒక మాదిరిగా దాడి జరుగుతూనే ఉందని, ఇక నాకు సహించే ఓపిక లేదు అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. లక్ష్మీస్‌ వీరగ్రంధం చిత్రాన్ని వెంటనే ఆపేయాలంటూ ఆమె డిమాండ్‌ చేసింది. లేదంటే పోలీసుల వద్దకు వెళ్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.