లక్ష్మీస్ ఎన్టీఆర్…ట్రైలర్ టాక్ !

Lakshmi's NTR Movie Trailer

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రయిలర్ కొద్దిసేపటిక్రితం విడుదలైంది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ గురువారం రిలీజ్‌ అయింది. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ అడివి రాముడు సినిమాలోని ఒక డైలాగ్ ని గుర్తు చేస్తూ మొదలయ్యే ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో స్పష్టం చూపించాడు వర్మ. ‘రామ రామ రామ రామ…’ అంనే బీజీఎంతో మొదలైన ట్రయిలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను, నటుడు మోహన్ బాబు పాత్రను పరిచయం చేశారు. స్వామీ… మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే’ అనే డైలాగ్, ‘రాత్రుళ్లు కూడా అక్కడే ఉంటోందట’ అన్న డైలాగ్, చంద్రబాబు పాత్రధారితో “ఈవిడ పేరు లక్ష్మీపార్వతి మా జీవిత చరిత్ర రాస్తున్నారు” అన్న ఎన్టీఆర్ డైలాగ్ వినిపిస్తున్నాయి. ఆపై “శారీరక సుఖం కోసమో.. ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోద్బలం కోసమో” అనే ఎన్టీఆర్ డైలాగ్, ‘దానికిగాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్’ అన్న చంద్రబాబు పాత్రదారి డైలాగులు ఉన్నాయి. ఆపై “ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే” అంటున్న ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ డైలాగ్ దాని తరువాత తన కుమారులై ఉండి వాడితో చేరారా సిగ్గులేకుండా అని ఎన్టీఆర్ అనడం, లక్ష్మీపార్వతి మెడలో తాళి కట్టడం, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన దృశ్యాలను ట్రయిలర్ లో చూడించారు వర్మ. ఈ సినిమా ఎన్ని వివాదాలకి కారణం అవుతుందో వేచి చూడాలి మరి.