Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2జీ కుంభకోణం కేసులో పరువును, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్న సీబీఐకి దాణా కుంభకోణం కేసులో మాత్రం సానుకూల తీర్పు వచ్చింది. 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరో 15 మందిని ఈ కేసులో దోషులుగా తేల్చింది. మాజీముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో సహా ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారుచేయనుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో లాలూతో పాటు 15 మంది దోషులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బిర్సా మండా సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ సమయంలో విలేకరులు లాలూను స్పందించాలని కోరగా, ఆయన విసుక్కున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోలీసువాహనం ఎక్కారు.
తీర్పు రానున్న సందర్బంగా ఈ ఉదయం మాత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 2013లో సుప్రీంకోర్టు తనను దోషిగా నిర్దారించిన సమయంలో తనకు చాలా ఆందోళన ఉందని, తన తర్వాత పార్టీని ఎవరు నడిపిస్తారనే భయం ఉందని లాలూ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం తన కుమారుడు తేజస్వియాదవ్ ఉండడంతో ఎలాంటి తీర్పు వచ్చినా తనకు ఆందోళన ఉండబోదని చెప్పారు. కోర్టు లాలూను దోషిగా నిర్దారిస్తున్న సమయంలో తేజస్వి కోర్టులోనే ఉన్నారు. అటు కేసు విచారణ సందర్భంగా లాలూ మద్దతు దారులు, భారీ సంఖ్యలో ప్రజలు కోర్టు వద్దకు తరలివచ్చారు. దీంతో ఆ పరిసరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.
లాలూ దోషిగా నిర్దారణ అయిన ఈ కుంభకోణం 21 ఏళ్ల క్రితం దేశరాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. 1991 నుంచి 1994 మధ్య జరిగిన దాణా కుంభకోణం 1997లో వెలుగులోకొచ్చింది. అప్పుడు లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశువుల దాణా పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. లాలూ గడ్డిమేశాడని ప్రతిపక్షాలు విమర్శల దాడి చేశాయి. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని ఆ పదవిలో కూర్చోబెట్టారు. దాణా కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం ఐదుకేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటైన చైబాసా కోశాగార కేసులో లాలూ ఇప్పటికే దోషిగా తేలారు. 2013లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఆయనకు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. లాలూ ఆరేళ్లు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం విధించింది. అప్పుడు రెండున్నరనెలలపాటు జైల్లో ఉన్న లాలూ ….ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు.
తాజా తీర్పు దేవగఢ్ కోశాగార కేసుకు సంబంధించినది. 1991-96 మధ్య కాలంలో దేవగఢ్ ట్రెజరీ నుంచి పశువుల దాణా కొనుగోలు పేరుతో రూ. 89లక్షలు అక్రమంగా విత్ డ్రా చేసినట్టు లాలూ సహా 22 మందిపై సీబీఐ 1997 అక్టోబరు 27న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. మరోవైపు తీర్పు నేపథ్యంలో లాలూ ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. తాను ఓడిపోలేదని, ఈ ధర్మయుద్ధంలో లాలూ ఒంటరివాడు కాదని పేర్కొన్నారు. పక్షపాతధోరణి ఉంటే నిజం కూడా అబద్దం లాగా లేదా అస్పష్టంగా కనిపిస్తుందని, ఆ పొరను తొలగిస్తే అసలు విషయం బయటపడుతుందని లాలూ వ్యాఖ్యానించారు.
నిజాన్ని తన కాళ్లజోళ్లలో దాచిపెట్టి అబద్ధం ప్రపంచమంతా తిరుగుతుందని, కానీ చివరకు నిజమే గెలుస్తుందని లాలూ ట్వీట్ చేశారు. తక్కువ వర్గానికి చెందిన వారు ఉన్నత వర్గాల అన్యాయాన్ని ప్రశ్నిస్తే..వారిని ఇలాగే శిక్షిస్తారన్న లాలూ తనను తాను నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ తో పోల్చుకున్నారు. వారిని కూడా చరిత్ర విలన్లను చేసిందని లాలూ కొత్త తరహాలో వ్యాఖ్యానించారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు అందరూ ఏకమయ్యారని, కానీ ఈ ధర్మయుద్ధంలో లాలూ ఒంటరివాడు కాదని, తనకు బీహార్ యావత్తూ అండగా ఉందని విశ్వాసం వ్యక్తంచేశారు. తన వ్యతిరేకులందరూ చెవులు రిక్కించి వినాలని, ఇలాంటి కేసుల వల్ల తాను ఓడిపోయినట్టు కాదని, కొంద ఆందోళన చెందినట్టు మాత్రమే అన్న లాలూ నిజాన్ని రక్షించడం కోసం ఎప్పటికీ సంఘర్షణ పడుతూనే ఉంటానని ట్వీట్ చేశారు. చివర్లో జైహింద్ అని ముగించారు. కోర్టు దోషిగా నిర్దారించడంతో లాలూలో వేదాంత ధోరణితో పాటు ప్రతీకార జ్వాల పెరిగిందని ఈ ట్వీట్ల తర్వాత రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.