ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.
‘లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.’ అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు.