పవన్ గొప్పదనమా… వామపక్షాల దిగజారుడుతనమా?

Left Parties Doesn't any comment on Modi Because of Pawan Kalyan

“ రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు”… ఇది భారత రాజకీయాల్లో బాగా నలుగుతున్న నానుడి. ఎన్నో సార్లు నిరూపితం అయిన నానుడి. ఇందులో ఎంత నిజం వున్నా అందుకు మించిన సమీకరణాలు కూడా ఉంటాయి అన్న భావన కమ్యునిషులు, కాషాయ దళాన్ని చూస్తే అనిపించేది. జాతీయ రాజకీయాల్లో కనీసం విధానపరమైన నిర్ణయాల సమయంలో అయినా బీజేపీ, కాంగ్రెస్ సైతం ఒకే మాట మీద ఉండి ఉండొచ్చు. కానీ అధికారం అన్న ప్రసక్తి లేని వామపక్షాలు మాత్రం బీజేపీ విధానాల్ని తూర్పారబట్టకుండా ఉండేది లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైన మోడీ వ్యతిరేక వాతావరణాన్ని రగిలించడంలో ఎర్ర జెండా కార్యకర్తలు తమ వంతు కృషి చేశారు. అయితే ఒకప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కలిసి పని చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలా ఎరుపు , కాషాయ జెండాల్ని ఒంటి నేషనల్ ఫ్రంట్ గొడుగు కిందకు తెచ్చిన ఘనత అప్పుడు ఆ ఫ్రంట్ చైర్మన్ గా వ్యవహరించిన నందమూరి తారక రామారావు దే. ఆపై మండల్ కమిషన్, బాబ్రీ మసీద్ అంశాలతో కమ్యూనిష్టులు, కాషాయదళం మధ్య ఏర్పడ్డ విభేదాలు తగ్గలేదు సరికదా అంతకంతకు పెరుగుతూనే వచ్చాయి. వామపక్షాల ప్రాభవం మసకబారి కమల ప్రభావం పెరగడంతో ఆ పార్టీల మధ్య దూరం పెరుగుతూనే వస్తోంది.

ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కమలం, వామపక్షాల మధ్య మధ్య మైత్రి కాదు కదా కనీసం శాంతి చర్చలు కూడా జరిపే పరిస్థితి లేదు. ఈ విషయం రాజకీయ ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నం అయిన వాతావరణానికి బీజాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు అస్తిత్వ పోరాటమే చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ పార్టీల పరిస్థితి మరీ దీనంగా ఉంది. టీడీపీ, వైసీపీ లు ఎర్ర పార్టీలని పట్టించుకోవడం మానేశాయి. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు కాస్త గౌరవం ఇచ్చి సలహాలు, సంప్రదింపులు ఇవ్వడంతో వామపక్షాలు కొద్దిగా ఊరట చెందాయి. ఓ వైపు తాము 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ ఆ మాటలు పట్టించుకోకుండా వామపక్షనేతలు జనసేన, లెఫ్ట్, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ లతో మహాకూటమి ఏర్పాటు చేస్తామని, తమ సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తోంది. సైద్ధాంతిక ప్రాట్జిపదికన రాజకీయాలు చేస్తాం అనే వామపక్షాలు చివరికి ఇలా అయిపోయాయా అనిపిస్తోంది. ఈ మాట అనడానికి పవన్ తో మహాకూటమి ఏర్పాటు ప్రాతిపదిక కాదు. అంతకు మించిన విషయం ఉంది.

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ సర్కార్ మొండి చెయ్యి చూపిందని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ తో బీజేపీ పొత్తు కొనసాగినప్పుడు ఆ హామీల అమలు కోసం ప్రజాసంఘాలతో కలిసి పోరాడింది వామపక్షాలే. అయితే పవన్ కి బీజేపీ తో లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టే ఏపీ హక్కుల కోసం మోడీ సర్కార్ ని నిలదీయడం మీద పవన్ దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనతో రాజకీయ ప్రయాణం చేయదలచుకున్న లెఫ్ట్ పార్టీలు పవన్ కి బీజేపీ ని నిలదీయాల్సిన అవసరాన్ని చెప్పకపోగా తామే కాషాయ పార్టీ మీద దాడి క్రమంగా తగ్గించాయి. మీడియా ప్రాభవం, విస్తృతి ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో లెఫ్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న విధానం ఆ పార్టీల జాతీయ నాయకత్వాలు తెలియదు అనుకోవడం భ్రమ. మొత్తానికి ఏపీ లో లెఫ్ట్ పరిస్థితి చూస్తే వాటిని బీజేపీ కి వ్యతిరేకంగా నోరు తెరవకుండా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలో లేక వామపక్షాలు అస్తిత్వం కోసం దిగజారాయి అని అనుకోవాలో అర్ధం కావడం లేదు.