ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఎల్జీ పాలిమర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కంపెనీలో నుంచి గ్యాస్ మళ్లీ లీకవుతోంది.. ఉదయం తెల్లవారుజాము నుంచి రెండోసారి మళ్లీ గ్యాస్ లీకవుతుండటంతో జనాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ నుంచి సుదూరంగా మళ్లీ పరుగులు తీశారు. కంపెనీలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ సిబ్బంది కూడా ప్రాణ భయంతో బయటకు వచ్చారు. అలాగే ఆ చుట్టు పక్కల సహాయక చర్యలు అందిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, నెవీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే..ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవరూ లేకుండా ఖాళీ చేయించి సుదూర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ నుంచి మళ్లీ గ్యాస్ లీక్ కావడంతో తిరిగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలా అలుముకొని ఉంది. తెల్లవారుజామున పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు అంతటా వ్యాపించింది. సెకండరీ రియాక్షన్ వల్ల గ్యాస్ ఎగజిమ్మినట్లు సమాచారం అందుతుంది. అయితే 45 రోజుల లాక్డౌన్ తో స్టోరేజ్ ట్యాంక్లోనే కెమికల్ ఉండిపోయిందని.. ఆ రియాక్షన్ గమనించకపోవడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా గ్యాస్ లీక్ జరిగిన 4 గంటల తర్వాత కూడా వెళ్లడానికి సిబ్బంది సాహిసించడం లేదు. ఇప్పుడు మళ్లీ రెండోసారి గ్యాస్ లీక్ కావడంతో ఆ ఏరియాలోని జనాల్లో ఆందోళన నెలకొంది.