Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసుపై తుదితీర్పు వెలువడింది. శ్రీనివాస్ ను కాల్చిచంపిన ఆడమ్ డబ్ల్యూ పూరింటన్ ను అమెరికాలోని ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆడమ్ జాత్యహంకారంతోనే శ్రీనివాస్ పై కాల్పులు జరిపి ఆయన్ను హత్యచేశాడని న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు.
2017లో..ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజులకు…ఫిబ్రవరి 22న హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్ మదసాని కెన్సస్ లోని ఒలేత్ నగరంలోని ఓ బార్ లో ఉండగా..అమెరికాకు చెందిన 52 ఏళ్ల ఆడమ్ అక్కడికి వచ్చాడు. మా దేశం నుంచి వెళ్లిపొండి అంటూ నినాదాలు చేస్తూ వారిద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా..అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు.
కాల్పులకు దిగిన ఆడమ్ ను అడ్డుకోబోయిన అమెరికాకు చెందిన లాన్ గ్రిలోట్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాస్ హత్యతో అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన అమెరికా ఫెడరల్ కోర్టు నిందితుడికి 165 నెలలు శిక్ష విధించింది. ఇది ముమ్మాటికీ జాత్యహంకారంతో చేసిన ఘటనేఅని న్యాయమూర్తి నిర్ధారించారు. తీర్పు అనంతరం శ్రీనివాస్ భార్య సునయన కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పుతో శ్రీనివాస్ తిరిగి రారని…కానీ ఇలాంటి ఘటనలు ఇకముందైనా జరగకుండా చూడాలని కోరారు. ఈ కేసులో తమకు అండగా నిలబడిన ఓలేత్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.