డేరా సచ్ఛా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో అదే సంస్థ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రామ్ రహీమ్ సింగ్, కృషాన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్‌దిల్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ హెచ్.పి.ఎస్.వర్మ తెలిపారు.
రామ్ రహీమ్ సింగ్‌కు రూ.31 లక్షలు, సబ్‌దిల్‌కు రూ.1.50 లక్షలు, జస్బీర్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, కృషాన్లాల్కు రూ.1.25 లక్షలు, అవతార్ సింగ్‌కు రూ.75 వేల జరిమానా న్యాయస్థానం విధించింది. దోషుల నుంచి జరిమానా సొమ్ము వసూలు చేసి, బాధిత కుటుంబానికి అందజేయాలని అధికారులను ఆదేశించింది. రామ్ రహీమ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న డేరా సచ్ఛా సౌదా అనుచరుడైన రంజిత్ సింగ్ అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేశాడు. హరియాణా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియాన్ గ్రామంలో 2002 జూలై 10న రంజిత్ సింగ్‌కు కాల్చి చంపారు.
డేరా సచ్ఛా సౌదా ప్రధాన ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వివరిస్తూ ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉందన్న అనుమానంతో అతడిని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. రంజిత్ సింగ్‌ను అంతం చేసేందుకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కుట్ర పన్నినట్లు సీబీఐ తన చార్జిషీట్లో వెల్లడించింది. డేరా బాబా ప్రస్తుతం సునారియా జైలులో ఉన్నాడు.