రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువతి హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడికి బుధవారం జిల్లా కోర్టు జీవిత ఖైదీగా శిక్ష విధించింది. సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధాదేవి తీర్పును వెలువరించారు. కాజిపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహీద్ లష్కర్, సింగారంకు చెందిన మునిగాల హారతి హనుమకొండలోని ఓ కళాశాలలో 2016లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివారు. ఆసమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు.
కొంత కాలం ప్రేమ సాఫీగానే సాగింది. షాహిద్ డిగ్రీ ఫెయిలయ్యాడు. కాజీపేటలోని తన తండ్రికి చెందిన మటన్ షాపులో చేదోడుగా ఉండేవాడు. హారతిని కలిసేందుకు ఆమె అక్క నివాసం ఉంటున్న హనుమకొండలోని రాంనగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో షాహిద్‌తో హారతి సన్నిహితంగా ఉండడం లేదని, వేరే యువకుడితో సాన్నిహిత్యంగా ఉంటోందనే నెపంతో హారతిని హత్య చేసేందుకు షాహిద్ ప్రణాళిక రూపొందించుకున్నాడు.
2020 జనవరి 10న షాహిద్ తన గదికి రమ్మని హారతిని పిలిచాడు.ఆమె రాగానే.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షాహిద్ హారతిపై అత్యాచారం చేసి కత్తితో గొంతుకోశాడు. కాజీపేట, విష్ణుపురి కాలనీలోని తన ఇంటికెళ్లి రక్తం అంటిన దుస్తులను మార్చుకున్నాడు. సుబేదారి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షులను విచారించి నిందితున్ని జైలుకు పంపించారు.