ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరో కొత్త ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్ మెట్రోరైల్ లకు తోడుగా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ను తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
నగరంలో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఏరియాల్లో అనేక బహుళజాతి కంపెనీలు ఇప్పటికే కొలువై ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఈ ఏరియాలో రాబోతున్నాయి. లక్షల మంది ఉద్యోగులు నిత్యం ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరంతా ఆఫీసులకు వచ్చి పోయేందుకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న రవాణ వ్యవస్థకు అదనంగా మరొకటి తేవాల్సిన అవసరం ఏర్పడింది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి పెద్ద హౌజింగ్ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్‌పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ లు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేస్తున్నట్టు సమాచారం. హెచ్‌యేఎంటీఏలో హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌లు భాగస్వాములుగా ఉన్నాయి.
ప్రస్తుత అంచనాల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర ఎల్‌ఆర్‌టీఎస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం వల్ల ఒకేసారి కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్ 2 లైన్ సైతం టచ్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.