ఏపీకి బాస‌ట‌గా నిలిచిన అద్వానీ

LK Advani Discussions With TDP MPS

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభ‌జ‌న హామీల కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌కు ప్ర‌తిపక్షాల నుంచే కాదు…అధికార‌పక్షంలోని కొంద‌రు నేత‌ల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఏపీపై కేంద్ర‌ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తున్న‌ప్ప‌టికీ…బీజేపీ సీనియ‌ర్ నేత అద్వానీ మాత్రం…బాస‌ట‌గా నిలుస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాల్సి ఉంద‌ని అద్వానీ అభిప్రాయ‌ప‌డ్డారు. లోక్ స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగిన టీడీపీ ఎంపీలతో అద్వానీ సుమారు ప‌దినిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. విభ‌జ‌న హామీలు, స‌భ‌లో నిర‌స‌న తెల‌ప‌డం, ఇత‌ర ప‌రిణామాల‌ను టీడీపీ ఎంపీలు ఆయ‌న‌కు వివ‌రించారు. అనంత‌రం వారితో మాట్లాడిన అద్వానీ ఒక‌రినొక‌రు గౌర‌వించుకోవాల‌ని, స‌భామర్యాద‌లు కాపాడుకోవాల‌ని సూచించారు.

ఏపీ వ్య‌వ‌హారంపై ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీతో తాను మాట్లాడాన‌ని, కేంద్రం ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తోందో అర్ధం కావ‌ట్లేద‌ని అద్వానీ నిరాశ వ్య‌క్త‌ప‌రిచిన‌ట్టు స‌మాచారం. బ‌డ్జెట్ లో ఏపీకి కేటాయింపులు జ‌ర‌ప‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం త‌ర్వాత కూడా అదే వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. ఏపీకి న్యాయం చేయాల‌న్న డిమాండ్ తో పార్టీల‌క‌తీతంగా ఏపీ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్నా..ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌న్నా లేదు. ప్ర‌ధాని మోడీ, ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీలిద్ద‌రూ త‌మ ప్ర‌సంగాల్లో పాత క‌థ‌లే వినిపించడం, హామీల అమ‌లుపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఈ అవ‌కాశాన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుంటున్న తీరును అద్వానీ వంటి సీనియ‌ర్ నేత‌లు గ‌మ‌నించి పార్టీకి న‌ష్టం క‌లుగుతుందేమ‌న‌ని ఆందోళన చెందుతున్నారు గానీ…బీజేపీని అంతా తామై న‌డిపిస్తున్న మోడీ, షాలు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా ఉన్నారు. ఈ ప‌రిణామాలు చూస్తున్న‌వారంతా ఏపీలో గత ఎన్నిక‌ల్లో కాంగ్రెస కు ప‌ట్టిన గ‌తి..ఈ సారి బీజేపీకి ప‌ట్ట‌డంతో పాటు..దేశ రాజ‌కీయాల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేషిస్తున్నారు.