ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటించాలని కేంద్రం ఆదేశం

ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటించాలని కేంద్రం ఆదేశం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ముందే అప్రమత్తం అయ్యింది. ఇతర దేశాలు చేసిన తప్పును చేయకుండా… ప్రధాని మోదీ ముందే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ముందుగా జనతా కర్ఫ్యూను పాటించి అనంతరం లాక్ డౌన్ ప్రకటించారు. దేశ ప్రజలంతా 21 రోజుల పాటు లాక్ డౌన్‌ పాటించాలన్నారు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో కొనసాగాయి. మార్చి 31 వరకు ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశాయి. అయితే రోజురోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్యపెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కూడా మరింత పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పలు మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి.

అయితే ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. ”అలాంటి లాక్‌డౌన్‌ పొడగింపు ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడగించే యోచనేమీ లేదు” అని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పష్టం చేశారు. అలాంటి వదంతుల్ని నమ్మొద్దు అని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని వదంతులు వ్యాప్తించాయి. దీంతో కేంద్రం వాటిని కొట్టివేసింది. అలాంటి ఆలోచనలు ఏమీ లేవని స్పష్టం చేసింది.