Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర మంత్రి అయ్యాక లోకేష్ కి కొరకరాని కొయ్యగా మారిన పార్టీ అంతర్గత వ్యవహారం అద్దంకి నియోజకవర్గ పరిస్థితి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా వున్న గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలోకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. అయితే పార్టీలోకి తీసుకొచ్చినంత తేలిగ్గా అక్కడ సీనియర్ నేత కె. బలరామకృష్ణమూర్తి ని సముదాయించలేకపోయారు. అద్దంకిలో పార్టీ అంతర్గత కలహాలు రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిలో పడ్డాయి. దీంతో చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాజీ ఫార్ములాలో భాగం అన్నట్టు బలరాం కి ఎమ్మెల్సీ చేసినా విభేదాలు తగ్గకపోగా ఇంకాస్త పెరిగాయి. అద్దంకిలో పార్టీ పరిస్థితి రచ్చరచ్చ కావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. బలరాం వర్గాన్ని అదుపు చేయడానికి ఆయన చేయని ప్రయత్నాలు లేవు. చివరికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పులో బలరాం కి స్థానం లేకుండా చేసాక గానీ కొంత ఫలితం రాలేదు.
ప్రస్తుతం అద్దంకిలో పరిస్థితి సద్దుమణిగినట్టు అనిపించినా అది నివురు గప్పిన నిప్పు మాత్రమే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ ప్రకాశం జిల్లా పర్యటనకి వస్తున్నారు. ఈ నెల 24 న లోకేష్ పర్యటనకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అద్దంకిలో పార్టీ ముఖ్యులతో లోకేష్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అద్దంకి టీడీపీ లో నెలకొన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలని లోకేష్ అనుకుంటున్నా అది ఎంతవరకు సాధ్యమో చెప్పలేని పరిస్థితి. ఓ వైపు పార్టీలో సీనియర్ నాయకుడు బలరాం, ఇంకో వైపు తానే పార్టీలోకి పిలిపించిన గొట్టిపాటి రవి కుమార్. ఆ ఇద్దరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో రాజకీయ వైరం. ఈ పరిస్థితుల్లో అద్దంకి లో పార్టీ ని గాడిలో పెట్టడం లోకేష్ కి పెద్ద పరీక్షే అని చెప్పుకోవాలి.