మాల్యాకి బ్రిటన్ కోర్టు పెద్ద షాక్…

London Court verdict on Vijay Mallya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారత్ లోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు మేర ఎగనామం పెట్టి లండన్‌ చెక్కేసి అక్కడ తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఐడిబిఐ బ్యాంక్‌ తో సహా దేశంలోని బ్యాంకులకు మాల్యా చెల్లించాల్సిన 155 కోట్ల డాలర్ల (సుమారు రూ.10,385 కోట్లు) అప్పులు చెల్లించాలని గత ఏడాది జనవరిలో డిఆర్‌టి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఎదురుతిరిగిన మాల్యా బ్రిటన్ కోర్టులో వ్యాజ్యం వేశారు. అయితే కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి 1.55 బిలియన్ డాలర్ల వ్యాజ్యంలో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు నిచ్చారు.

ఈ తీర్పుతో భారతీయ బ్యాంకులు ఆయనకు ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు అవకాశం వచ్చినట్టియింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం ఈ పిటిషన్ దాఖలు చేసింది. జడ్జి ఆండ్రూస్ హెన్షా ఈ తీర్పును ఇచ్చారు. మాల్యా ఉద్దేశ్యపూర్వకంగా రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ఆయనపై 13 బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి. అయితే తీర్పు ఇచ్చిన అనంతరం తీర్పుపై మాట్లాడేందుకు మాల్యా తరఫు న్యాయవాదులు నిరాకరించారు. 17 భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి 2016 మార్చి 2న మాల్యా దేశం విడిచి లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 18న అరస్టైన మాల్యా… ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు.

ఇదంతా మరో ఎత్తు అయితే మరోపక్క మాల్యా ఆస్తుల జప్తుకు ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఉత్తరువులు జారీ చేశారు. విజయ్ మాల్యా ఆస్తులను బెంగళూరు పోలీస్ కమిషనర్ ద్వారా జప్తు చేయాలని కోర్టు మార్చి 27న ఈ ఆదేశాలు ఇచ్చింది, ఈ ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను మే 8న సమర్పించాలని ఆదేశించింది. కానీ ఈడీ న్యాయవాది ఎన్ కే మట్టా మాట్లాడుతూ జప్తుకు సంబంధించిన సమాచారం సంబంధిత అధికారుల నుంచి తమకు రాలేదని కోర్టుకి తెలిపారు. దీంతో దీపక్ షెరావత్ స్పందిస్తూ విజయ్ మాల్యా ఆస్తుల జప్తుకు తాజాగా ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ జూలై 5న జరుగుతుందని తెలిపారు.