ఆకాశంలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగహణం నవంబరు 19న ఏర్పడతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా శనివారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది. భారతకాలమానం ప్రకారం నవంబరు 19 న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం తారస్థాయికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.
అప్పుడు భూమి పౌర్ణమిలో 97 శాతం సూర్యకిరణాల నుండి దాచిపెడుతుంది అని నాసా తెలిపింది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో, చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఇది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 23 సెకన్లపాటు ఉండనుంది. ఇది 2001 నుంచి 2100 మధ్య 100 ఏళ్లలో వచ్చే ఇతర గ్రహణం కంటే ఎక్కువ ఉంటుందని నాసా తెలిపింది.
21వ శతాబ్దంలో భూమి మొత్తం 228 చంద్ర గ్రహణాలను చూస్తుందని నాసా పేర్కొంది.ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్‌కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి.