అదుపుతప్పిన లారీ చెక్‌పోస్ట్‌పైకి.. పలువురికి గాయాలు..

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ దృష్ట్యా లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోకు తృటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. తహసీల్దార్‌తో పాటు అతని సిబ్బంది పైకి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో తహసీల్దార్‌తో పాటు గిర్థవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అసలేం జరిగిందంటే.. ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అదెలాగంటే.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అశ్వారావుపేట శివారులో రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చే వలస కూలీలు ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకుని స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జంగారెడ్డి గూడెం వైపు వెళ్తోన్న ఓ లారీ అదుపుతప్పి చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఎమ్మార్వో ప్రసాద్, గిర్దవర్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు, పశ్చిమ బెంగాల్ వలస కూలీల మేస్త్రి ముజాహిద్దీన్ గాయపడ్డారు. అలాగే.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం వల్ల అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.